తాండూరు, నవంబర్ 5: వికారాబాద్ జిల్లా తాండూరు రూపురేఖలు మార్చే అమృత్ 2.0లో భాగంగా డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న మాస్టర్ ప్లాన్ సర్వేలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 1న డ్రోన్ ద్వారా ఈ సర్వే ప్రారంభించారు. సర్వేలో భాగంగా హైదరాబాద్ రోడ్డు మార్గం బషీర్మియా తండా సమీపంలో డ్రోన్ పైకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా క్రిందకు వచ్చే క్రమంలో హైటెన్షన్ వైర్లకు తగిలి నిప్పంటుకుంది. ఆ డ్రోన్ వరి పొలాల మధ్య పడిపోవడంతో పంటకు కూడా మంటలంటుకున్నాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. మరో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.
రీజినల్ రింగ్ రైల్ లైడార్ సర్వేకు కోసం ప్రత్యేక హెలికాప్టర్ మంగళవారం కొడంగల్‌కు చేరుకుంది. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా నిర్మించే ‘రింగ్ రైల్’ లైడార్ సర్వేకు కొడంగల్ వేదికైంది. మూడు రోజులపాటు ఈ సర్వే నిర్వహించనున్నట్టు ఆర్వీ అసోసియేట్స్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. సుమారు 564 కిలోమీర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, భవనగిరి, యాదాద్రి, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్‌ను కలుపుతూ ఈ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నారు.