ఖిలావరంగల్, మార్చి 13: శివనగర్ను వరద ముంపు నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.239 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డక్ట్ (భూగర్భ వరద కాలువ) నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఆ పనులను అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో తరచుగా పైపులు పగిలి(Drinking water) తాగునీరు వృథాగా పోతోంది. గ్రేటర్ వరంగల్ 34, 35 డివిజన్లలోని శివనగర్‌లో అండర్ గ్రౌండ్ డక్ట్ డ్రైనేజీ పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపించింది. దీంతో విచ్చలవిడిగా పనులు చేస్తుండడంతో తరచూ తాగునీటి పైపులు పగిలిపోతున్నాయి. దీంతో తాగు నీటి సరఫరా సమస్యగా మారింది.
వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ఏసిరెడ్డినగర్ కాకతీయుల మట్టికోట అగడ్త వరకు, అలాగే మట్టికోట ఉత్తర ద్వారం నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా శివనగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పనులు జరి గేటప్పుడు బల్దియా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టరీతిన భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో తాగు నీటి పైపులు పగిలిపోయి నీరు వృథాగా పోతున్నదని స్థానికులు ఆరో పిస్తున్నారు.
35వ డివిజన్ ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో పైపు పగిలి రెండు రోజులుగా తాగునీరు రోడ్డు పాలవుతుందని, ఫలితంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కూడా పైపులు పగలడం వల్ల సుమారు 20 రోజులపాటు తాగునీరు సరఫరాకు అంతరాయం కలిగింది. అసలే ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు పైపులకు మరమ్మతులు చేపట్టి తాగునీటిని సరఫల చేయాలని, అలాగే అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షించి పైపులు పగలకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.