బీజింగ్: సముద్ర జలాల నుంచి పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ హైడ్రోజన్‌ను తయారుచేసి చైనా ఘనత సాధించింది. ఈ రెండు విలువైన వనరులను ఒకే మిషన్‌ను ఉపయోగించి, ఒకే ప్రక్రియలో రాబట్టింది. దీని కోసం సమీపంలోని స్టీల్, పెట్రోకెమికల్ ప్లాంట్స్ నుంచి విడుదలయ్యే వృథా ఉష్ణాన్ని, సముద్ర జలాలను ఉపయోగించింది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఫెసిలిటీ లేదని, ఇదే మొదటది అని చైనా మీడియా తెలిపింది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఉష్ణాన్ని వృథాగా పోనివ్వకుండా, ఈ ప్లాంట్‌లోని ఇంజినీర్లు ఓ సిస్టమ్‌కు పంపిస్తారు. ఈ సిస్టమ్ సముద్ర జలాలను తాజా తాగునీరు, శుద్ధ ఇంధనంగా మార్చుతుంది. ఒక ఇన్పుట్-మూడు ఔట్పుట్లుగా ఇది పని చేస్తుంది. మొదటిది, తాగునీటిని ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి 800 టన్నుల సముద్ర జలాల నుంచి 450 క్యూబిక్ మీటర్ల అత్యంత స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నీటిని ఇండ్లు, ప్రయోగశాలలు, పరిశ్రమల్లో ఉపయోగించుకోవచ్చు.
రెండోది, సంవత్సరానికి 1,92,000 క్యూబిక్ మీటర్ల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. భూమిపైగల అత్యంత శుద్ధ ఇంధనాల్లో ఇది ఒకటి అని చెప్తున్నారు. బస్సుల నుంచి పారిశ్రామిక యూనిట్ల వరకు అన్నింటికీ ఈ ఇంధనం ఉపయోగపడుతుంది. మూడోది, ఈ ప్రక్రియలో 350 టన్నుల మినరల్స్ పుష్కలంగా ఉండే బ్రిన్ను ఉత్పత్తి చేస్తుంది. రకరకాల మెరైన్ కెమికల్స్‌ను తయారు చేయడానికి బ్రిన్ ఉపయోగపడుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలో కారు చౌకగా ఉప్పు నీటిని తాగునీటిగా మార్చుతాయనే పేరు ఉంది. అంతకన్నా తక్కువ ఖరీదుకు చైనా తాగునీటిని తయారు చేస్తున్నది. ఒక క్యూబిక్ మీటరు సముద్రపు నీటి ఖరీదు రూ.24. దీనిని ఉపయోగించి తయారు చేసిన తాగునీటి ఖరీదు సుమారు రూ.42 ఉంటున్నది. కాలిఫోర్నియాలోని భారీ కర్మాగారంలో ఉత్పత్తి అయిన డీశాలినేటెడ్ వాటర్ ఖరీదు రూ. 186. ఈ ప్లాంట్ వద్ద తయారైన ఇంధనంతో సంవత్సరానికి దాదాపు 3,800 కి.మీ. మేరకు 100 బస్సులను నడపవచ్చు.