హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల మనుగడకు (డిస్కం) భారీ గండం పొంచి ఉన్నది. క్యాప్టివ్ పవర్.. ఓపెన్ యాక్సెస్ రూపంలో భారీ ఉపద్రవం సమీపిస్తున్నది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్యాప్టివ్ పవర్, ఓపెన్యాక్సెస్ వైపు పయనిస్తున్నాయి. అనుమతులివ్వాలంటూ డిస్కంలను ఆశ్రయిస్తున్నాయి. కొన్ని ఓపెన్ యాక్సెస్, మరికొన్ని క్యాప్టివ్ పవర్‌కు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాయి. రోజురోజుకు వీటి అనుమతుల కోసం డిస్కంలపై ఒత్తిడి పెరుగుతున్నది. కొత్త వాటికి అనుమతులిచ్చే విషయంపై డిస్కంలు తర్జనభర్జనపడుతున్నాయి. ఆచితూచి అనుమతులిస్తున్నాయి. వీటివల్ల డిస్కంలకు వీలింగ్ చార్జీలు, సర్‌చార్జీలు మాత్రమే వసూలు చూసుకునే అవకాశం ఉండటంతో డిస్కంలు ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితులున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అడిగిన వారికి అడిగినట్టు ఓపెన్ యాక్సిస్, క్యాప్టివ్ పవర్ ఇస్తే విద్యుత్తు పంపిణీ సంస్థలు నిర్వీర్యంకానున్నాయి. ఇదిలా ఉంటే అనుమతినిస్తే ఒక బాధ.. ఇవ్వకపోతే ఒక బాధ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇస్తేనేమో డిస్కంలు మరింత కుదేలయ్యే అవకాశం ఉన్నది. ఇవ్వకపోతే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావడం కష్టంగా కనిపిస్తున్నది. మొత్త ంగా ముందు నుయ్యి.. వెనుక గొయ్య అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అయితే, ప్రభు త్వం ముందు రెండే రెండు ఆప్షన్లున్నాయి. సబ్సిడీలను ఎత్తివేయడం లేదంటే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చడం. ఈ రెండు తప్ప మరో మార్గం కనిపించడంలేదు.
విద్యుత్తు సంస్థలు ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్‌కు అనుమతిస్తే.. భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు డిస్కంల పరిధిలో ఉండవు. తమకు నచ్చిన చోటి నుంచి కరెంట్‌ను తెచ్చుకుంటాయి. టైమ్ ఆఫ్ డే (టీవోడీ) విధానంలో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ విద్యత్తును కొనుక్కుంటాయి. దీంతో డిస్కంలు ఆ ర్థికంగా కుదేలవడం ఖాయంగా కనిపిస్తున్నది. మన దగ్గర డిస్కంలు హెచ్‌టీ సర్వీస్‌లు (ఇండస్ట్రియల్, కమర్షియల్) కనెక్షన్లపై అదనపు భారం మోపి.. గృహ, వ్యవసాయ కనెక్షన్ల వినియోగదారుల నుంచి తక్కువ చార్జీలు వసూ లు చేస్తున్నాయి. హెచ్‌టీపై వచ్చిన లాభాన్ని ఎల్టీపై వచ్చే నష్టంతో సర్దుబాటు చేస్తున్నాయి. హెచ్‌టీ వినియోగదారులు డిస్కం పరిధి నుంచి జారిపోతే ఎల్టీ వినియోగదారుల సబ్సిడీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం సాధ్యంకాదు. అంతేకాకుండా, ఇప్పుడున్న విద్యుత్తు టారిఫ్ విధానంలోనూ మార్పులు చేయాల్సిందే. విద్యుత్తు ఎక్సేంజీలో యూనిట్ విద్యుత్తు రెండు, రెండున్నర రూపాయలకే దొరుకుతుంటే.. హెచ్‌టీ వినియోగదారులు యూనిట్‌కు 10-11 రూపాయలు చెల్లించేందుకు ఒప్పుకోరు. ఇస్తే ధర తగ్గించి ఇవ్వండి.. లేదంటే బయట కొనుక్కుంటామని డిస్కంలను భయపెట్టే రోజులొస్తాయి.
ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్ వినియోగానికి డిస్కంలు అనుమతులు ఇవ్వకపోయినా ఇబ్బందికర పరిస్థితులే ముందున్నాయి. అదనపు భారం మోపితే భరించేందుకు ఏ పరిశ్రమ కూడా సిద్ధంగా ఉండదు. అంటే భవిష్యత్తులో ఈ భారాన్ని భరించలేక పరిశ్రమలు తక్కువకు విద్యుత్తు దొరికే రాష్ర్టాలకు తరలివెళ్తాయి. అంతేకాకుండా కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు రాష్ర్టానికి రావడం అనుమానంగానే కనిపిస్తున్నది. మన దగ్గర అనుమతులివ్వకుండా తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర క్యాప్టివ్ పవర్, ఓపెన్ యాక్సెస్‌కు అనుమతులిస్తే పరిశ్రమలు అక్కడికి తరలివెళ్తాయి. మన రాష్ట్రంలో అడగుపెట్టేందుకు జంకే పరిస్థితులు ముందున్నాయి. కేంద్ర విద్యుత్తు శాఖ విడుదల చేసిన ఎలక్ట్రిక్ యాక్ట్-2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు సైతం డిస్కంల పాలిట శాపంగా మారనున్నాయి. తయారీరంగం, రైల్వే, మెట్రోలపై రాబోయే ఐదేండ్లల్లో క్రాస్‌సబ్సిడీ భారాన్ని ఎత్తివేయాలని ఆ డ్రాఫ్ట్‌లో కేంద్రం పొందుపరిచింది. అంటే ఈ మూడు రంగాలపై అదనపు భారాన్ని మోపవద్దని సూచించింది. విద్యుత్తు ఉత్పత్తి, ట్రాన్స్మిషన్కు ఎంత ఉత్పత్తి అవుతున్నదో అంతే చార్జిచేయాలని స్పష్టంచేసింది. అంటే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై ఎలాంటి అదనపు భారం మోపవద్దు. ప్రస్తుతం మోపుతున్న భారాన్ని ఐదేండ్ల కాలంలో పూర్తిగా తగ్గించాలి. అంటూ ఓపెన్యాక్సెస్, క్యాప్టివ్ పవర్, మరోవైపు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అంతిమంగా సబ్సిడీలను ఎత్తివేయాలనే సంకేతాలిస్తున్నాయి.
వినియోగదారులు బహిరంగ మార్కెట్లో నేరుగా విద్యుత్తును కొనుగోలు చేయడమే ఓపెన్ యాక్సిస్ విధానం. అంటే విద్యుత్తు పంపిణీ సంస్థలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా సంస్థలే విద్యుత్తును కొనుక్కుంటాయి. భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ తరహా ఒప్పందాలు చేసుకుంటాయి. వినియోగదారులు తమకు నచ్చిన సరఫరాదారులు (విద్యుత్తు ఉత్పత్తి సంస్థల)తో కొనుగోలు ఒప్పందం చేసుకుంటారు. ఇప్పటికే ఉన్న ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను వాడుకుంటారు. ఇందుకుగాను ఈఆర్సీ అనుమతించిన మేరకు వీలింగ్ చార్జీలను చెల్లిస్తాయి.
పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు వాటి సొంత అవసరాల కోసం ప్రత్యేకంగా పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ప్రభుత్వ లేదా.. ప్రైవేట్ విద్యుత్తు సరఫరాపై వీరు అస్సలు అధారపడరు. గ్రిడ్‌ను ఉపయోగించుకోరు. ఉదాహరణకు ఒక కంపెనీకి సొంతంగా పవర్‌ప్లాంట్ ఉన్నది అనుకుందాం. అదే కంపెనీకి స్టీల్ పరిశ్రమ, లేదా బల్క్ గ్రడ్ పరిశ్రమ, ఐటీ సంస్థ ఉంటే వాటికి తమ పవర్‌ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తునే వాడుకుంటాయి. తమ పవర్ ప్లాంట్‌లోని విద్యుత్తును, తమ సంస్థలు వాడుకోవడమే క్యాప్టివ్ పవర్.