హైదరాబాద్, నవంబర్ 5: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,341.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,480 కోట్లతో పోలిస్తే 9.35 శాతం తగ్గింది. లాభంలో నిరాశే ఎదురైన సంస్థకు ఆదాయంలో కాస్త ఊరట లభించింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం ఎగబాకి రూ.6,880 కోట్ల నుంచి రూ.8,016 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..ఉత్తర అమెరికా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో కోత పడిందని, అయినప్పటికీ అన్ని విభాగాలు ఆశాజనక పనితీరు కనబరిచాయన్నారు. మరోవైపు, నికోటైనెల్, ఇతర బ్రాండ్ల విలీనం పూర్తి కానున్నదన్నారు.
గ్లోబల్ జనరిక్ ఆదాయం కిక్కు
అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలను విక్రయించడంతో భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. గత త్రైమాసికానికి వీటి ద్వారా రూ.7,157 కోట్లు లభించినట్లు పేర్కొంది. దీంట్లో ఉత్తర అమెరికా నుంచే సగం రూ.3,728 కోట్లు లభించడం విశేషం. మిగతాదాంట్లో యూరప్ నుంచి రూ.577 కోట్లు సమకూరగా, భారత్ నుంచి రూ.140 కోట్లు లభించాయి. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 16.76 శాతం పెరిగి రూ.1,103 కోట్లకు చేరాయి.