హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఆ డాక్టర్ పర్యావరణ ప్రేమికుడు. తాను విరివిగా మొక్కలు నాటడంతోపాటు తన పేషంట్లను కూడా మొక్కలు నాటాలని ప్రోత్సహిస్తాడు. మొక్కలు నాటిన వారు ఒకవేళ దవాఖానలో చేరిన 30 శాతం ఫీజులో రాయితీ కూడా ఇస్తాడు. ఆయనే ఏపీలోని నరసరావుపేటకు చెందిన ప్రముఖ న్యూరాలజీ డాక్టర్ రమేశ్ నెల్లూరి. పర్యావరణ స్పృహ కలిగిన డాక్టర్ రమేశ్ సేవలను గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కొనియాడారు. మొక్కలు నాటేందుకు కృషిచేస్తున్న రమేశ్‌ను ట్విట్టర్లో బుధవారం అభినందించారు. డాక్టర్ రమేశ్ ప్రతినెల ఒక ఆదివారం తన సమీపంలోని గ్రామానికి వెళ్లి వందల మంది రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తారు.
చికిత్స చేయించుకున్న ప్రతి రోగి మొక్క నాటాలని షరతు విధిస్తూ.. వారికి మొక్కలను అందజేస్తున్నారు. ప్రతి నెల వారు నాటిన మొక్కలను ఫోన్ ద్వారా ఫొటో తీసి డాక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. అలా క్రమం తప్పకుండా మొక్కల ఫొటోలు పంపిస్తే.. వారు ఎప్పుడైనా దవాఖానలో చేరితే బిల్లులో 30 శాతం తగ్గింపు ఇస్తారు. ఇలా గ్రామీణ తోటలను ప్రోత్సహిస్తున్నారు. మామిడి, జామ, ఇతర పండ్ల మొక్కలను డాక్టర్ రోగులకు అందజేస్తున్నారు. ‘నా పేషెంట్లు నేనిచ్చిన మొక్కలు నాటి పెంచి వాటి పండ్లను తీసుకొని నా దగ్గరికి తిరిగి రావడమే నా జీవితంలో అత్యుత్తమ రోజులు’ అని రమేశ్ గర్వంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. డాక్టర్ రమేశ్ సేవ ఎంపీ సంతోష్ దృష్టికి రావడంతో ట్విట్టర్లో అభినందించారు.
An incredible initiative by Dr. Ramesh Nelluri, a neurologist who breathes life not only into patients but also into the environment. His innovative approach of using tree planting as a means of giving back to nature deserves applause. His efforts are a reminder that medicine can… https://t.co/F0iJ3OpG5R
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 30, 2023