ఖైరతాబాద్, అక్టోబర్ 13 : కోడి గుడ్డు కొవ్వును పెంచుతుందనేది అపోహ మాత్రమేనని, రోజు నాలుగు గుడ్లు తింటే ఆరోగ్యం చెక్కచెదరదని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) సలహాదారు డాక్టర్ కరణం బాలస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నెక్ సీఈవో డాక్టర్ ఏజిల్ కుమార్, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్, నెక్ జోనల్ సంఘం అధ్యక్షులు జక్క సంజీవరెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కే మోహన్‌రెడ్డితో కలిసి కోడి గుడ్డు విశిష్టత తెలియజేసే బ్రోచర్లను ఆవిష్కరించారు.
గుడ్డులోని పచ్చ సొన కంటే తెల్ల సొలోనే అధిక పోషక విలువలుంటాయని చెప్పారు. 44 ధాతువులుండే పచ్చ సొన తినడం వల్ల మంచి కొలెస్ట్రార్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని, రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటుందని వివరించారు. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నెక్ కేంద్ర సభ్యుడు డీ సుధాకర్, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డీఎస్ సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర హేచరీస్ జనరల్ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.