హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు చేసిన కృషి ఇప్పుడు పారిశ్రామిక భూముల లభ్యతలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టింది. తెలంగాణ రాష్ర్టాన్ని పారిశ్రామికరంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో దాదాపు లక్షన్నర ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. కాగా, దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు 76వేల ఎకరాలు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు డీపీఐఐటీ(కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) తమ తాజా నివేదికలో వెల్లడించింది. పరిశ్రమల ఏర్పాటుకు అతి ముఖ్యమైనది భూమి, మౌలిక సదుపాయాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పారిశ్రామికరంగంలోనూ తీవ్ర నిరాదరణకు గురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వ్యవసాయం, నీటి పారుదల రంగాలతో సమానంగా పారిశ్రామికరంగానికి ప్రాధాన్యమిచ్చారు.
ఇందులో భాగంగా రాష్ర్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పక్కా ప్రణాళికతో ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా బీఆర్ఎస్ సర్కారు పరిశ్రమల అవసరాల కోసం 1,45,682.99 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజర్వ్ చేసింది. ఈ భూములను ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్‌గా నోటిఫై చేశారు. దశలవారీగా పెద్ద ఎత్తున అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,458 ఎకరాల్లో 157 ఇండస్ట్రియల్ పార్క్‌లు కొనసాగుతున్నాయి. ఇందులో సింహభాగం బీఆర్ఎస్ హయాం లో అభివృద్ధి చేసినవే. ఈ క్రమంలో డీపీఐఐటీ దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ర్టాలవారీగా సిద్ధంగా ఉన్న భూముల వివరాలను వెల్లడించింది. వాటిలో సుమారు 76వేల ఎకరాలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశంలోని 4,523 పార్కుల మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లకు గాను 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా, అందులో ప్రస్తుతం 10,747 హెక్టార్ల భూమి అందుబాటులో ఉంది. ఇందులో 600లకు పైగా పార్కులు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైనవే. అప్పట్లో ఆంధ్రా పాలకులు తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతూ, రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులను ఎక్కువగా ఆంధ్రాకు తరలించారని తాజా గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నది. తెలంగాణలో ఉన్న 157 పారిశ్రామికవాడల్లో సింహభాగం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి చేసినవే కాగా, ఏపీలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 600లకు పైగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేయడం గమనార్హం.
