హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వరకట్న పిశాచాలు ఎక్కువయ్యాయి. కొత్త జీవితంపై కోటి ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన కోడళ్లను కట్నం కోసం పీక్కుతింటున్నాయి. గత ఆరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా వరకట్న వేధింపుల కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శ నం. 2020 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు తెలంగాణలో 51,586 వరకట్న వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
రాష్ట్రం లో పెరిగిన విడాకుల కేసులు, వరకట్న వేధింపులు, మరణాల కేసుల వివరాలను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద డీజీపీ కార్యాలయానికి దరఖాస్తు చేయడంతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ గణాంకాలను వెల్లడించినట్టు ‘యూత్ ఫర్ యాం టీ కరప్షన్’ సంస్థ వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి తెలిపారు.
ఆ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఈ ఏడాది వరకట్న మరణాల (సెక్షన్ 304 బీ) కేసులు భారీగా నమోదయ్యాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 81 మంది వరకట్న రక్కసికి బలయ్యారు. నిరుడు మొత్తంగా 58 వరకట్న మరణాలు సంభవించగా.. కొవిడ్ సంక్షోభ సమయం (2020)లో అత్యధికంగా 180 మరణాలు నమోదయ్యాయి.
