Fertilizers | హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్‌లో ఎరువుల రవాణా, హ్యాండ్లింగ్, స్టోరేజీకి సంబంధించిన టెండర్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, మంత్రితోపాటు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతిచోటా ఏదో గూడుపుఠాణి నడుస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో మార్క్‌ఫెడ్‌లోని ఓ అధికారి అంతా తానై వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
ఎరువుల టెండర్లలో ఏదో గూడుపుఠాణి జరిగిందనడానికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తీరుపైనే మొదటి అనుమానం వ్యక్తమవుతున్నది. గడిచిన పదేండ్లుగా ఎరువుల ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లింగ్‌కు సంబంధించి ఏడాది కాలానికి మాత్రమే టెండర్లు పిలుస్తున్నారు. కానీ, ఈసారి మాత్రం రెండేండ్ల కాలానికి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తున్నది. ఎరువుల ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లింగ్‌కు సంబంధించి తొలుత ఏప్రిల్ 5న ఒక పత్రికలో ఇచ్చిన 5వ పేజీలోనోటిఫికేషన్లో కేవలం ఒకే సంవత్సరానికి (2025-26) టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ ఏప్రిల్ 9న సవరణ నోటిఫికేషన్ జారీచేసిన మార్క్‌ఫెడ్ 2025-26, 2026-27 రెండేండ్ల కాలానికి టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నది. దీని వెనుక ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేండ్ల కాలానికి టెండర్ పిలవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
సవరణ ప్రకటనపై కాలయాపన… ఎందుకీ రహస్యం?
ప్రీబిడ్ సమావేశంలో నిబంధనల మార్పులపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడంలోనూ అధికారులు గోప్యత పాటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నోటిఫికేషన్లో ఏప్రిల్ 15న ప్రీబిడ్ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నగా దీనిని 11వ తేదీకి మార్చారు. అయితే ఈ మార్పుపై పలువురు ఆసక్తి గల బిడ్డర్లకు సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే, 11వ తేదీన జరిగిన ప్రీబిడ్ మీటింగ్‌లో చేసిన సవరణలను వెంటనే బిడ్డర్లకు మరో నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలి. కానీ, 11న సమావేశం జరిగితే 23వ తేదీన సవరణలు చేసినట్టుగా పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డాక్యుమెంట్‌ను వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సమావేశం పూర్తయిన 12 రోజుల తర్వాత నిర్ణయాలు వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏమిటి? ఎవరి కోసం ఆలస్యం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు బిడ్డర్లకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఆలస్యం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సవరణల నోటిఫికేషన్ 23న వెలువడితే.. 28వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. అంటే బిడ్డర్లకు మిగిలింది ఐదు రోజులే. ఇందులో ఆదివారం పోతే మిగిలింది నాలుగు రోజులే. ఇంత తక్కువ సమయంలో బిడ్డింగ్ ఎలా వేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల్లోనూ తప్పులు… గందరగోళం
టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్‌ను తయారు చేయడంలో మార్క్‌ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కాపీ పేస్ట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ముఖ్యమైన నోటిఫికేషన్‌ను తప్పుల తడకగా రూపొందించడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులు చెప్పిన దాని ప్రకారం.. బిడ్డింగ్ వేసేందుకు స్టోరేజీ, హ్యాండ్లింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి. లేదా హ్యాండ్లింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఐదేండ్ల అనుభవం లేదా స్టోరేజీలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. కానీ, నిబంధనల్లోని పేరా 3.3.1లో ఉన్న అనుభవం సర్టిఫికెట్ కాలంలో మాత్రం స్టోరేజీ, హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మూడేం డ్ల అనుభవంతోపాటు హ్యాండ్లింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ లేదా స్టోరేజీలో ఐదేండ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ రెండు వేరువేరు నిబంధనలను ఒకటిగా కలిపేసి పేర్కొనడం గమనార్హం. ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కొన్నిచోట్ల ‘ఐదేండ్లకుపైగా’ అనుభవం ఉండాలని పేర్కొన్న అధికారులు.. మరికొన్ని చోట్ల ‘ఐదేండ్ల’ అనుభవాన్ని మాత్రమే పేర్కొన్నారు. ఇలాంటి తప్పుల నేపథ్యంలో భవిష్యత్‌లో లీగల్ సమస్యలు ఏర్పడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తున్నది. ఇక మరో అంశం.. మొత్తం ఆరు లక్షల టన్నుల నిల్వ సా మర్థ్యం గల గోదాములను బిడ్డర్ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే, నిబంధనల్లో బిడ్డింగ్ సమయానికి సగం సామర్థ్యం అంటే మూడు లక్షల టన్నుల సామర్థ్యాన్ని చూపించాలని, ఆ తర్వాత బిడ్డింగ్ దక్కితే నెల రోజుల్లో మిగిలిన మూడు లక్షల టన్నుల సామర్థ్యం చూపించాలని పేర్కొన్నారు. ఈ నిబంధన పూర్తి లోపభూయిష్టమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల్లో 3 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను కల్పించడం సాధారణ విషయం కాదని, ఇందులో తెరవెనుక తతంగం నడుస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకుకు..
ప్రభుత్వ సంస్థలు తమ ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, మార్క్‌ఫెడ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకు కొటక్ మహీంద్రకు పెద్దపీట వేసింది. ఇప్పటికే సంస్థకు చెందిన కోట్లాది రూపాయల డిపాజిట్లను కొటక్‌లో పెట్టిన అధికారులు.. ఇప్పుడు ఎరువుల టెండర్లో ఈఎండీతోపాటు ఇతర లావాదేవీలకు కొటక్ బ్యాంకు ఖాతాను నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. ఈ టెండర్ల ద్వారా ఈఎండీ రూపంలోనే బ్యాంకు ఖాతాలో రూ.2.16 కోట్లు జమవుతాయి. అదే విధంగా టెండర్ పూర్తి తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో మరో రూ.5.4 కోట్లు జమవుతాయి. ఈ విధంగా స్వల్పకాలంలోనే బ్యాంకుకు కోట్లాది రూపాయల ట్రాన్జాక్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్ అధికారులు ఎస్బీఐని కాదని, ప్రైవేటు బ్యాంకును ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొటక్ మహీంద్ర బ్యాంకులో డిపాజిట్లపై గతంలోనే పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ అధికారులు అదే బ్యాంకుతో అంటకాగడంపై మరోసారి అరోపణలు గుప్పు
మంటున్నాయి.