హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మరోసారి స్పందించారు. ఈ ప్రాజెక్టు విషయమై సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడినట్టుగానే, మంగళవారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడినట్టు తెలిసింది. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ ఇద్దరూ పరోక్షంగా, ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే మాట్లాడడం గమనార్హం. బనకచర్ల ప్రాజెక్టుకు వీరిద్దరూ కలిసే అంకురార్పణ చేశారన్న బీఆర్ఎస్ వాదనకు వీరి వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి.
క్యాబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో అనుమతుల్లేని చాలా ప్రాజెక్టులు కడుతున్నారని అడ్డగోలుగా ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణలో కొందరు బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారని విమర్శించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని మరోసారి పాత పాటే పాడారు.
తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు. సున్నితమైన అంశం కావడంతో నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా బనకచర్లపై స్పందించారు. ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరామని, త్వరలోనే ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు.