బటర్ ఫ్లై ఎఫెక్ట్: ఎక్కడో జరిగే ఒక కదలిక, మరెక్కడో జరిగే ఒక ఫలితాన్ని నిర్ణయిస్తుందనే సిద్ధాంతం ఇది. గోపన్‌పల్లిలో రూ.9వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు వేసిన ‘బిగ్’ స్కెచ్‌లోనూ ఇలాంటి బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.
మూడు నెలల కిందట.. హెచ్‌సీయూ భూముల్లో ప్రభుత్వం చేసిన విధ్వంసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఆపడానికి, జీవావరణ వ్యవస్థ విధ్వంసాన్ని, జంతు, మానవ హక్కుల అణచివేతను నిలువరించడానికి సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగాల్సి వచ్చింది. బాధ్యత కలిగిన రాష్ట్రప్రభుత్వం గంటల వ్యవధిలోనే వంద ఎకరాల్లో పర్యావరణాన్ని ఎందుకు కాలరాసింది? పచ్చని చెట్లతో అలరారుతున్న 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఐటీ పార్కుగా ఎందుకు మార్చాలనుకుంది?. ఈ ప్రశ్నలు మాత్రం అప్పుడు సశేషంగా మిగిలిపోయాయి.
ఇప్పుడు.. గోపన్‌పల్లిలో 90 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు బిగ్ బ్రదర్స్ నేతృత్వంలో భూ దందాకు తెరలేపడంతో హెచ్‌సీయూ విధ్వంసానికి సమాధానం దొరికినట్టయింది. ఇందులో భాగంగా బసవతారకనగర్ను ఖాళీ చేయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ భూములకు ఆనుకొని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కూడా ఉండటం ఇప్పుడు అనుమానాలను బలపరుస్తున్నది. ఐటీ అభివృద్ధి, యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు వంటివన్నీ తెర మీద పాలకులు చెప్పిన తీపి మాటలని, వెనుక చేదు నిజాలు వేరే ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ 90 ఎకరాల కోసమే కంచ గచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసం జరిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు 32 ఎకరాలు వదిలిపెడితే 142 ఎకరాలకు గ్రీన్‌సిగ్నల్ ఇప్పిస్తామని భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెప్పిన కుట్రదారులు.. ఇప్పుడు మరో 25 ఎకరాలను గుంజుకునేందుకు స్కెచ్ వేసినట్టు వెలుగులోకి వస్తున్నది.
(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, జూలై 10, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేసిన బిగ్ భూదందాపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకొస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన, కీలకమైన ప్రాంతంగా ఉన్న విప్రో సర్కిల్‌కు హెచ్‌సీయూ భూములు అతి సమీపంలో ఉంటాయి. దానిని ఆనుకొని గోపన్‌పల్లి గ్రామపరిధి ఉంది. విలువైన ప్రాంతం కావడంతో హెచ్‌సీయూ 400 ఎకరాలతోపాటు గోపన్‌పల్లిలోని రెండు సర్వేనంబర్లలోని భూములు మినహా పెద్దగా ఖాళీ జాగాలు లేవు. ఆ ప్రాంతమంతా నిర్మాణాలతో నిండిపోయింది. దీంతో హెచ్‌సీయూ భూములతోపాటు భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాల్సిన సర్వేనంబర్ 36, 37లోని భూములకు డిమాండ్ గణనీయంగా ఉన్నది. ఓవైపు హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల తీర్పు వచ్చింది. మరోవైపు భాగ్యనగర్ టీఎన్జీవో భూముల అంశం చాలా కాలంగా పెండింగులో ఉన్నది. ఈ నేపథ్యంలో కొందరు ప్రభుత్వ పెద్దలు ఈ భూములపై కన్నేశారని తెలుస్తున్నది. ఓవైపు భూములు దక్కించుకోవడం, మరోవైపు వాటి విలువను అమాంతంగా పెంచుకునేందుకు ప్రణాళికలు రచించినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే 400 ఎకరాల్లో ఐటీ పార్కు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు గోపన్‌పల్లి సర్వేనంబర్ 36, 37ల్లో 90 ఎకరాలు తమ భూములు ఉన్నాయంటూ క్లెయిమ్ చేస్తున్న నర్సింగరావు, ఇతరులతో అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం.
400 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటుచేస్తే 90 ఎకరాలకు భారీ ఎత్తున డిమాండ్ పెరుగుతుందని అక్రమార్కులు భావించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను మార్కెట్లో తనఖా పెట్టి రూ.10వేల కోట్లు తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. ఈ 400 ఎకరాల్లో 150 ఎకరాల వరకు తమకు అనుకూలమైన వారికే కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారనే ప్రచారమూ జరిగింది. ఓవైపు ఐటీ పార్కు ఏర్పాటు చేసి, మరోవైపు 150 ఎకరాలను చేజిక్కించుకొని ఆ తర్వాత భాగ్యనగర్ టీఎన్జీవో భూముల వ్యవహారాన్ని ముగించాలనేది తెరవెనక పెద్దల ప్రణాళికగా పేర్కొంటున్నారు. హెచ్‌సీయూ భూములపై విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట. దీంతో తమ ప్రణాళికలు విఫలమవుతాయన్న ఆందోళనతో ఒక్కసారిగా రాత్రికిరాత్రి పదుల సంఖ్యలో బుల్డోజర్లను పెట్టి వంద ఎకరాల్లో విధ్వంసం సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం కూడా బెడిసికొట్టడంతో తమ ప్లాన్‌ను మార్చుకున్నట్టు సమాచారం.
ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవోలు..కొందరు పెద్దలు ఒత్తిడి చేయడంతో 175 ఎకరాల్లో 32 ఎకరాలను వదులుకోవాలనే షరతును అంగీకరించి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిసింది. మార్గం సుగమంకావడంతో రెవెన్యూ అధికారులు 30 ఎకరాలకు ఎన్వోసీ జారీ చేసినట్టు సమాచారం. మిగిలిన 60 ఎకరాలు ఎలా తీసుకోవాలనే దానిపై బిగ్‌బ్రదర్స్ నేతృత్వంలో ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. సర్వేనంబరు 36లో భాగ్యనగర్ టీఎన్జీవోలు గతంలో లేఅవుట్ చేసిన 142.11 ఎకరాలకు ఆనుకొని 25 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ 25 ఎకరాలను ఉద్యోగుల లేఅవుట్లో నుంచి తీసుకోవాలనే స్కెచ్ కూడా ‘బిగ్ బ్రదర్స్’ వేసినట్టు సమాచారం. నర్సింగరావు, ఇతరులకు చెందిన 25 ఎకరాలు భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెందిన లేఅవుట్లో ఉందని రెవెన్యూ అధికారులు కూడా ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారట. దీనిని బట్టి ఉద్యోగులకు చెందిన 32 ఎకరాలకు ఇప్పటికే ఎసరు పడగా.. మరో 25 ఎకరాలకూ ముప్పు పొంచి ఉన్నట్టు స్పష్టం అవుతున్నది.
ఐటీపార్కు ఏర్పాటు బెడిసికొట్టడంతో తెరవెనక పెద్దలు నేరుగా 90 ఎకరాలనైనా దక్కించుకోవాలని కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు రెండు మార్గాల్లో ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. ముందుగా భాగ్యనగర్ టీఎన్జీవోలతో సంప్రదింపులు జరిపి, వారికి నయానోభయానో నచ్చజెప్పి 32 ఎకరాలు వదులుకునేందుకు ఒప్పించారని సమాచారం. తర్వాత దాదాపు ఎనిమిది ఎకరాల్లో ఉన్న బసవతారకనగర్ బస్తీని ఖాళీ చేయిస్తున్నారని చెప్పున్నారు. బీజేపీకి చెందిన స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని రంగంలోకి దింపి వ్యూహాత్మకంగా పదుల సంఖ్యలో నిరుపేద కుటుంబాలను అక్కడి నుంచి పంపించినట్టు సమాచారం.