హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదలచేశారు. మొత్తం మూడు విడుతల్లో సీట్లను భర్తీచేయనుండగా, శనివారం నుంచే మొదటి విడుత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్ వెబ్‌సైట్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. మూడు విడుతల వెబ్ కౌన్సెలింగ్ జూన్ 28న ముగియనున్నది. మూడు విడుతల్లో సీట్లు పొంది ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జూన్ 24 నుంచి 28 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో నేరుగా రిపోర్టుచేయాల్సి ఉంటుంది. జూన్ 24 నుంచి 28 వరకు కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. జూన్ 30 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో 1,057 డిగ్రీ కాలేజీలు ఉండగా, మొత్తం 4,57,724 సీట్లు ఉన్నాయి. వీటిలో 70 కాలేజీలు నాన్ దోస్త్ కాలేజీలు ఉండగా, 40,603 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను దోస్త్ ద్వారా కాకుండా ఆయా కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుంటున్నాయి. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. డిగ్రీలో ఇంతకాలం అమలైన 15 శాతం ఏపీ కోటా ఇకనుంచి ఉండదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏండ్లు పూర్తవడంతో ఏపీ కోటాను తొలగించారు. మొత్తం 95 శాతం సీట్లను తెలంగాణ స్థానికులతో, మరో 5 శాతం సీట్లను రాష్ట్రంలో స్థిరపడ్డ ఇతర రాష్ర్టాల వారి పిల్లలు, మన రాష్ట్రం వారిని వివాహం చేసుకున్న వారితో భర్తీచేస్తారు. దీంతో మొత్తం సీట్లు మనోళ్లకే దక్కనున్నాయి. ఈసారి దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్పాటు ఎస్సీ వర్గీకరణను దోస్త్‌లో అమలుచేయాలని నిర్ణయించారు.