హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలతోపాటు వారి ఆస్తులు, ఇంటి పన్నులు తదితర వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఇంటింటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేయబోతున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగంగా ఇంటింటికీ డిజిటల్ మ్యాపింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్తో డూప్లికేషన్‌కు తావు లేకుండా పోతుందని, ప్రతి కుటుంబ సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో పారదర్శకంగా తెలుసుకునేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడింగ్‌కు సంబంధించిన పూర్తి ప్రయోజనాలపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నది. దేశవ్యాప్తంగా డిజిటల్ మ్యాపింగ్ నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ బాధ్యతలను సర్వే ఆఫ్ ఇండియా (ఎస్వోఐ)కి అప్పగించినట్టు తెలుస్తున్నది. డిజిటల్ మ్యాపింగ్ కోసం తెలంగాణలో 143 పట్టణాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలో డిజిటల్ మ్యాపింగ్ పూర్తవగానే ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన స్టిక్కర్‌ను అతికిస్తారు. కానీ, డిజిటల్ మ్యాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రస్తుతం ఆ పనులు ముందుకు సాగడం లేదని అధికారులు చెప్తున్నారు.