హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు బిల్లులు చెల్లించాలని వచ్చే మోసపూరిత ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను వినియోగదారులు నమ్మొద్దని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే కట్టకపోతే రాత్రిపూట సరఫరా నిలిపివేస్తామని కొందరు బెదిరించి వినియోగదారుల బ్యాంక్ అకౌంట్, డెబిట్‌కార్డు వివరాలు తీసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్తు బిల్లుల వసూలు, చెల్లింపుల కోసం టీఎస్ ఎస్పీడీసీఎల్ సిబ్బంది బ్యాంక్ అకౌంట్, డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలు అడగరని గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఎవరైనా ఫోన్ల ద్వారా వినియోగదారులకు బిల్లులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వివరాలు సంస్థ www.tssouthernpower.com వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.