సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు వెళ్లకుండా పోలీసులు మహిళా సంఘాల నేతల్ని టుంకిమెట్ల వద్ద అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కే గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. లగచర్ల ఘటనలో వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్తున్న మహిళా సంఘాల నేతలు ప్రొఫెసర్ పద్మజాషా, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వీ సంధ్య, ఝాన్సీ, సజయ, అనసూయ, జ్యోతి, శ్రీదేవి, గీతను పోలీసులు అడ్డగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వారిని బలవంతంగా హైదరాబాద్కు తరలించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని చెప్పారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి అనుమతి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించే వారిని అరెస్ట్ చేస్తూ నిర్భందాన్ని ప్రయోగించడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోనే లగచర్ల బాధితులు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి వెళ్లి ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన లగచర్ల బాధితులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం లగచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నాయకులు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతికి విన్నవించారు. స్పందించిన రాష్ట్రపతి కార్యాయాల అధికారులు లగచర్ల ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని అడిగారు. లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, పోలీసుల అక్రమ అరెస్ట్లు, ఫార్మాసిటీ కోసం బలవంతపు భూ సేకరణ వివరాలను అందజేశారు. మంగళవారం రాత్రివరకు కూడా వారికి అపాయింట్మెంట్ లభించలేదు.