హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఇంచార్జి వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం ఆర్జీయూకేటీపై బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీలోని సమస్యలను పరిష్కరించడమే కాకుండా, విద్యార్థులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని, బోధన, భోజన, వసతి పరంగా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు, ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.