Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వచ్చాయని.. అప్పుడే ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈరోజుకు కూడా అదే మాట మీద ఉన్నామని పేర్కొన్నారు. సీఎం రమేశ్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దని సూచించారు.
బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదని.. బీఆర్ఎస్ భావజాలం వేరు.. బీజేపీ భావజాలం వేరు అని కేసీఆర్ చెప్పారని జగదీశ్ రెడ్డి తెలిపారు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దని.. చంద్రబాబు నాయుడు అలాంటి వారికే పదవులు ఇచ్చారని అన్నారు. సీఎం రమేశ్ ఇంటికి నేను కూడా మిత్రునిగా వెళ్ళాను. ఆయన ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని 23వ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేశ్ ఇంట్లోనే ఉంటున్నాడు.. ఆ సీసీ టీవీ ఫుటేజి తీద్దామా అని నిలదీశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు తీయాలంటే సీఎం రమేశ్ తన జీవితకాలంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటారన్నారు.
తమను భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని సీఎం రమేశ్ తనతో చెప్పారని జగదీశ్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలోకి వెళ్లినా కూడా ఎప్పటికీ చంద్రబాబు మనుషులమే అని ఆయన చెప్పారని అన్నారు. కవిత జైలుకు వెళ్తే బెయిల్ ఇచ్చేది కోర్టు.. ఆమె విషయంలో పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఎట్లా అంటారని ప్రశ్నించారు. కేటీఆర్ భాష విషయంలో ఒక్క అక్షరం తప్పు లేదని.. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పారన్నారు. పథకం ప్రకారం బీజేపీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్ అని జగదీశ్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారని తెలిపారు. తాత్కాలికంగా మీరు నాలుగు రోజులు సంతోషపడవచ్చని అన్నారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరని స్పష్టం చేశారు. కులం ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో ఉందా. ఏపీలో కులం గురించే మాట్లాడతారని తెలిపారు. కులగజ్జి శిష్యుడు రేవంత్ రెడ్డికి అంటుకుందని అన్నారు. రుత్విక్ కంపెనీ నాది కాదు అన్న సీఎం రమేశ్.. ఆ మాటలకు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టునే సీఎం రమేశ్ చదివారని విమర్శించారు. బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తే ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ కలుస్తుందని ప్రశ్నించారు. సీఎం రమేశ్ ఎప్పుడూ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లలేదని.. మమ్మల్ని చేయి విరిసి బీజేపీలో చేర్చుకున్నారని అన్నారు. ఆయనకు బీజేపీలో అంత సీన్ లేదు. ఆయనను ఎక్కడ ఉంచాలో బీజేపీ వాళ్ళు అక్కడే ఉంచుతారని తెలిపారు.