ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 02:40:12

బయోమెట్రిక్‌ లేకుండా రేషన్‌

బయోమెట్రిక్‌ లేకుండా రేషన్‌

  • పౌరసరఫరాలశాఖకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయోమెట్రిక్‌తో సంబంధం లేకుండా బీపీఎల్‌ కుటుంబాలకు 12 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేయాలని హైకోర్టు పౌరసరఫరాలశాఖకు ఆదేశాలు జారీచేసింది. ఇతర రాష్ర్టాల వలస కూలీలతోపాటు రేషన్‌కార్డు రద్దయినవారికి కూడా బియ్యం ఇవ్వాలని పేర్కొన్నది. అధికారులు ఎక్కువసంఖ్యలో రేషన్‌కార్డులు తొలిగించారని, అలాంటివారికి బయోమెట్రిక్‌ లేనందున సరుకులు అందజేతకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ.. ఎస్‌క్యూ మసూద్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రాంచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ఎక్కడా రేషన్‌కార్డులు తొలిగించలేదని పేర్కొన్నారు. వలస కార్మికులకు స్థానిక బీపీఎల్‌ కుటుంబాల తరహాలోనే 12 కిలోల బియ్యం, నగదు అందజేశామని పేర్కొన్నారు. జీవోనంబర్‌ 45 ప్రకారం రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ రూ.1500 చెల్లించాలని హైకోర్టు తెలిపింది. రేషన్‌ తీసుకోనివారికి రూ.1500 చెల్లించడంలేదని దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై పూర్తి వివరాలు అందజేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. వాదనలు నమోదుచేసుకున్న ధర్మాసనం.. రెండు పిటిషన్లను వచ్చేనెల రెండోతేదీకి వాయిదా వేసింది.


logo