హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పు ట్టి, తెలంగాణలోనే చదువు ప్రారంభించి తెలంగాణ కోటా కింద ఏపీలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువు పూర్తిచేసిన విద్యార్థికి స్థానికత వర్తిస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ విద్యార్థి శశికిరణ్కు మెడికల్ సీటు కేటాయింపులో స్థానికత వర్తిస్తుందో లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ నారాయణరావు వైద్య వర్సిటీకి మంగళవారం నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగే విచారణలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన తనకు స్థానిక కోటా కింద మెడికల్ సీటును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ శశికిరణ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ ఎం మొహియుద్ధీన్ ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.