Doddi Komaraiah Birth Anniversary | నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాన్ని, ఉద్యమ స్ఫూర్తిని సీఎం గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ పథకాలు, రాయితీ అందిస్తున్నట్లు సీఎం తెలిపారు.
నియంతృత్వ పాలన నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం, సాయుధ పోరాట యోధుల నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశయమైన ప్రజా పాలన సాగిస్తున్నామని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువనిస్తూ, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించామని, మంత్రివర్గం మొదలు అన్ని నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.