మారేడ్‌పల్లి, నవంబర్ 29: దేశంలోనే తొలిసారిగా పల్మనరీ థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్టు యశోద వైద్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ ఇంట్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీ రఘు మాట్లాడుతూ ‘అక్టోబర్ 28న కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి రిషికేశ్ (20) ఛాతినొప్పి, ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో యశోద దవాఖానకు వచ్చాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు పల్మనరి ఎంబోలిజంతో బాధపడుతున్నట్టు గుర్తిచాం. అత్యాధునిక ఇనారి మెడికల్ డివైజ్ పల్మనరి థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా రక్తనాళాల్లోని క్లాట్స్‌ను తొలగించాం. ప్రస్తుతం రిషికేశ్ ఆరోగ్యంగా ఉన్నాడు’ అని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ హరికిషన్, ఫల్మనాలజిస్ట్ డాక్టర్ విక్రమ్, డాక్టర్ హేమలతలు పాల్గొన్నారు.