హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21,(నమస్తే తెలంగాణ): క్యాన్సర్‌తో బాధపడుతున్న 24 ఏండ్ల యువకుడికి సూరారం మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. 24 ఏండ్ల గౌతమ్‌కుమార్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. రెండులైన్ల కీమోథెరపీ చికిత్స చేయించుకుని మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్‌కు వచ్చాడు.
గౌతమ్‌ను పరీక్షించిన వైద్యులు ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్స్ సార్కోమాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వెంటనే సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ హరీశ్ నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ ఆంకాలజీ బృందం 16గంటలపాటు హెచ్ఐపీఈసీ శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు. సంప్రదాయ చికిత్సా పద్ధతులు విఫలమైన సందర్భాల్లో.. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగులకు దీర్ఘకాలిక మనుగడకు అవకాశం లభిస్తుందని డాక్టర్ హరీశ్ ఈ సందర్భంగా తెలిపారు.