భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్యుడు నారాయణ రావుపై డిజిటల్ అరెస్టు పేరుతో (Digital Arrest) సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మీ మొబైల్ నంబర్‌తో చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయని, బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరుకావాలంటూ బెదించారు. మాజీ ఎమ్మెల్యే భూపతిరావు అల్లుడు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక బావ.. డాక్టర్ నారాయణరావు భద్రాచలంలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు క్లినిక్‌లో ఉన్న సమయంలో బెంగళూరు పోలీసుల పేరుతో ఆయనకు ఓ వీడియో కాల్ వచ్చింది.
‘బెంగళూరులో మీపై 17 కేసులు నమోదయ్యాయి. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైంది. మీ పేరుతో ఉన్న మరో ఫోన్ నెంబరుతో చట్ట వ్యతిరేక పనులు జరిగాయి. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి విచారణలో పాల్గొనాలి. బెంగళూరు వచ్చి పోలీసుల ఎదుట హాజరుకావాలి’ అని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్లాక్ మెయిల్ చేశారు. గురువారం సాయంత్రం కూడా మరోసారి గంటసేపు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన కొత్తగూడెం పోలీసులు ప్రత్యేక అధికారుల బృందంతో దర్యాప్తు చేస్తున్నది. కాగా, నారాయణరావు కుమారుడు కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.