హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): చదువులో ప్రతిభ కనబరిచినా అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరణకు గురికావంతో మనస్తాపం చెందిన ఓ యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి (38) కజికిస్తాన్లో 2005-2010లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత 2022లో ఫారిన్మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా పొం దారు. అమెరికా వెళ్లి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్, రెసిడెన్సీ చేయాలని భావించారు. కొంతకాలంగా హైదరాబాద్ పద్మారావునగర్‌లో నివాసముంటున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి బ్రోంక్స్‌లోని మాంటిఫెరీ మెడికల్ సెంటర్లో అడ్మిషన్ లెటర్, ఈసీఎఫ్ఎమ్జీ సర్టిఫికెట్లు సిద్ధం చేశారు. పరిశోధకులు, వైద్యులకు ఇచ్చే జే-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త నిబంధనలు రోహిణికి సమస్యగా మారాయి. మొదటి మూడు టెస్టులు పూర్తి చేసుకున్న ఆమెకు చివరి రౌండ్లో నిరాశే ఎదురైంది. నెల క్రితం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ జరిగింది. పొటెన్షియల్ ఇంటెంట్ టు ఇమిగ్రేట్ (శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవాలనే ఉద్దే శం) కారణాన్ని చూపుతూ వీసా నిరాకరించారు. కానీ వెంటనే జాయిన్ కావాలని వర్సిటీ నుంచి సమాచారం రావడంతో రోహిణి తీవ్ర ఒత్తిడికి గురైంది. తన అమెరికా కల చెదిరిపోయిందనే నిరాశలో ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరుకు తరలించారు.