Baobab Trees | అక్కినేని నాగార్జున ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 1080 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నాడు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అడవిని దత్తత తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోలో ఉన్న ఒక చెట్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎందుకంటే ఆ ఫొటోలో ఉన్నది మామూలు చెట్టు కాదు.. వందల ఏండ్ల చరిత్ర కలిగిన బోబాబ్ చెట్టు. చూడటానికి ఏనుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏనుగు చెట్టు (హథియన్ వృక్షం) అని కూడా అంటారు. మడగాస్కర్‌లో మాత్రమే కనిపించే ఈ చెట్టు హైదరాబాద్ నగరం రావడం వెనుక పెద్ద చరిత్ర ఉంది. దాదాపు 700 ఏండ్ల క్రితం దేశ సంచారం చేసే మౌల్వీలు భాగ్యనగరానికి వచ్చినప్పుడు గోల్కొండ సమీపంలో బస చేశారు. ఆ సమయంలోనే మడగాస్కర్ అడవుల్లో నుంచి తీసుకొచ్చిన బోబాబ్ చెట్టును అక్కడ నాటినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ చెట్టు గోల్కొండ నయా ఖిల్లాలో మనకు కనిపిస్తుంది. ఈ బొబాన్ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. ఈ చెట్టు వేర్లలో అధిక మొత్తంలో నీటిని నిల్వ చేసుకుంటాయి. ఒక్కో చెట్టు లక్ష లీటర్ల నీటిని దాచుకుంటుంది. ఇలాంటి మహావృక్షాలు నాగార్జున దత్తత తీసుకున్న రిజర్వ్ ఫారెస్ట్‌లో నాలుగు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ శంకుస్థాపన సందర్భంగా.. ఈ మహావృక్షాల చరిత్రను తెలుసుకునేందుకు అక్కినేని కుటుంబం ఆసక్తి చూపించింది. బోబాబ్ చెట్ల సంరక్షణకు కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు.
గోల్కొండ నయా ఖిల్లాలో ఉన్న ఏనుగు చెట్టు 25మీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ మహా వృక్షం మధ్య భాగంలోని రెండు కొమ్మల మధ్య ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం లోపలికి వెళ్తే ఒక గది ఉంటుంది. అందులో 40 మంది వరకు ఉండే అవకాశం ఉంది. అప్పట్లో ఈ చెట్టు తొర్రలో దొంగలు దాచుకునేవారని.. అందుకే దీన్ని అలీబాబా 40 దొంగల గది అని కూడా పిలుస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ఇలాంటి చెట్టు అబిడ్స్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో కూడా ఉంది. 10 అడుగుల వెడల్పు కాండం కలిగిన ఈ చెట్టు 150 ఏండ్ల క్రితం నాటిదని అంచనా వేస్తున్నారు.