పూడూరు, అక్టోబర్ 6: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని, దానిని వేరే ప్రాంతానికి తరలించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయం వద్ద దామగుండం పరిరక్షణ సమితి, విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘దామగుండం నువ్వు సల్లగుండాలె’ అనే పాటను విమలక్కతో కలిసి మహేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అడవిలో నేవీ రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే 400 ఏండ్ల చరిత్ర గల దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాడార్ కేంద్రం ఏర్పాటుతో మనుషులతోపాటు ఇతర జంతువులకు కూడా ముప్పు ఉంటుందని భావించే అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆ ఫైల్‌పై సంతకం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా ఏర్పాటు చేస్తామంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. బహుజన బతుకమ్మ కమిటీ నిర్వాహకురాలు విమలక్క మాట్లాడుతూ.. దామగుండం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అడవులను నరికి నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే భావితరాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనిల్‌రెడ్డి, వెంకటయ్య, రామన్న, స్వామీజీ, వ్యక్తలు అడ్వకేట్ రాంచౌళ, పస్య పద్మ, తులసీచంద్, అరుణ, పృథ్వీరాజ్, సీపీఐ బాలమల్లేశ్, దేవకీదేవి, శ్రీనివాస్‌గౌడ్, హరీశ్వర్‌రెడ్డి, చుక్క రాంనర్సయ్య, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.