కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలు తమకు అందలేదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ సంఘాలతో బహిరంగ విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల మంది ఎన్యూమరేటర్లతో కులగణన చేపట్టనున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తప్పుడు సమాచారం నమోదు చేసినా, ఎన్యూమరేటర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టంచేశారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, జయప్రకాశ్, సురేందర్, కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రసాద్, ఆర్డీవో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ ఎమ్మె ల్యేలు, ఎంపీలు హాజరుకాకపోవడం గమనార్హం.
కరీంనగర్ కలెక్టరేట్లో బహిరంగ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీసీ కమిషన్ ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం చేసింది. జిల్లాలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బీసీ నాయకులు అగ్రకులానికి చెందిన వారు తమ రిజర్వేషన్ల గురించి మాట్లాడనవసరం లేదని, ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల మా ట్లాడే ప్రయత్నం చేయగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అడ్డుకొని మాట్లాడనివ్వలేదు.
బీసీల సంక్షేమంపై తమ పార్టీకి, కేసీఆర్‌కే చిత్తశుద్ధి ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట సంజయ్ తెలిపారు. బీసీ కమిషన్ చెల్లదని కోర్డు డైరెక్షన్ ఇచ్చిందని, డెడికేటెడ్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టి, కేవలం రాజకీయం కోసమే బీసీ కమిషన్ విచారణ చేపడుతున్నదని ధ్వజమెత్తారు. ఇది విచారణ కమిషన్‌గా కనిపించడం లేదని, కాంగ్రెస్ విచారణ కమిటీగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. కచ్చితంగా బీసీలకు 42 శా తం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన బీసీల బహిరంగ విచారణ సమయంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దీంతో సమావేశ స్థలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. బీసీ కమిషన్ సభ్యు డు మాట్లాడుతుండగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చీకట్లలోనే సభ్యులు అలాగే మాట్లాడగా, ఎవరికీ వినిపించనూ లేదు. అరుపులు, కేకలు ధ్వనించాయి. ఆ తర్వాత జనరేటర్‌తో సమావేశం కొనసాగించారు. చైర్మన్ మాట్లాడుతుండగా మరోసారి కూడా అంతరాయం కలిగింది.