హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కొడుకు తాగుడుకు బానిసయ్యాడనే కారణంతో రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలన్న ఓ వృద్ధ జంట అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమ కుమారుడు శ్రీధర్ గౌడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని, తాగుడుకు బానిసై భార్యను వదిలేశాడని, తమను వేధిస్తున్నాడని, మద్యం వల్ల కుటుంబం నాశనమైనందున మద్య నిషేధాన్ని విధించాలని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రామచంద్రగౌడ్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. పిల్‌ను కొట్టేసింది. మద్యనిషేధంపై ఉత్తర్వులు ఇవ్వలేమని, ఉత్తర్వుల జారీ పరిధి కోర్టులకు లేదని స్పష్టం చేసింది. చట్టసభలే నిర్ణయాలు తీసుకోవాలని, కోర్టులు కాదని పేర్కొన్నది.