హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు పెంచి, విద్యార్థులపై భారం మోపొద్దని, లెక్చరర్స్‌కు జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేశాయి.
బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులు ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తంకు వినతిపత్రం సమర్పించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ రూ.2 లక్షలకు పైగా ఫీజులను నిర్ణయిస్తూ ప్రతిపాదనలు పంపించారని ఆయా సంఘాలు తెలిపాయి. అంత భారీగా ఫీజులు ఎలా నిర్ణయిస్తారని, తప్పుడు ఆడిట్ లెక్కల ఆధారంగా ఫీజులు ప్రతిపాదనలు చేశారని ఆరోపించాయి.