హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలపై దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ చూపాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వాన్కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వాన్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హన్సర్సింగ్ ఆర్యాలతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, సభ్యులు జిల్లా శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, రాంబాబునాయక్, నీలాదేవి సమావేశమయ్యారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో బాధితులు, సాక్షులతో నిందితులు కేసులు రాజీ చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. దీంతో చట్టం స్ఫూర్తి నీరుగారి బాధితులకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. స్పందించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ మక్వాన్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర సామాజిక న్యాయమంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాకుండా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు గుర్తుచేశారు.