సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 9: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు టికెట్ ఇవ్వొద్దని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆ పార్టీకి చెందిన జగిత్యాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓ దశలో ఆ పార్టీ కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసుకొని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాడు. కార్యాలయం ఎదుట బైఠాయించిన శ్రేణులు.. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రావాలి, అర్వింద్ డౌన్‌డౌన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీగా గెలిచిన అనంతరం అర్వింద్ పార్టీ కార్యకర్తలకు తీవ్రం అన్యాయం చేస్తున్నారని జగిత్యాల నాయకులు ధ్వజమెత్తారు. అర్వింద్‌కు టిక్కెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త సతీశ్ పెట్రోల్ పోసుకోవడంతో అక్కడున్న వారు అతనిపై నీళ్లు చల్లి వారించారు.