Governor Tamilisai | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి డిప్యూటీ గవర్నర్ హోదాలో ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ రాజకీయాలు చేయడంపై తమిళనాట డీఎంకే, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆమె బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు తప్ప గవర్నర్‌గా పనిచేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు తాజా వ్యాఖ్యలనే ఉదాహరణగా పేర్కొన్నారు. దాదాపు 25 ఏండ్లు బీజేపీలో కొనసాగిన తమిళనాడు సినీనటి గౌతమి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వ్యక్తికి బీజేపీ సీనియర్ నేతలు అండగా నిలిచారని, కష్టకాలంలో తనకు బీజేపీ నేతలు అండగా నిలవకుండా, తనను మోసం చేసిన వ్యక్తికే మద్దతు ఇస్తున్నారని, 2021లోనూ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి చివరకు మోసం చేశారని, ఇక బీజేపీలో కొనసాగేది లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని గౌతమి ప్రకటించిన విషయం తెలిసిందే. స్థానిక మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని గవర్నర్ తమిళిసై వద్ద ప్రస్తావించగా పాత్రికేయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని సినీ నటి గౌతమి తనతో చెప్పి ఉంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా పరిష్కరించేందుకు సహాయం అందించే దానిని పేర్కొన్నారు. తమిళిసై స్పందించిన తీరుపై అక్కడి విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గవర్నర్ హోదాలో రాజకీయాలు చేయడమేమిటని నిలదీస్తున్నాయి.