మాగనూరు, మార్చి 30 : ప్రతి ఎన్నిల్లో డ్రామాలు చేయడం, ప్రజలను మోసం చేయడంలో రేవంత్రెడ్డి దిట్ట అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో కృష్ణ, మాగనూరు మండలాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని, ఆయన ధోరణి ఓ ప్రతిపక్ష నేతగా ఉన్నదని విమర్శించారు.
ఆయన ఇక్కడికొచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఓ ఆడబిడ్డగా తానేమీ అనదనుకుంటున్నారేమో.. బిడ్డా.. ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్నారు. రేవంత్ సర్కార్ అమలుకు నోచని హామీలతో పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పలోకి జారిపోయినందున హామీలపై చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. రాహుల్ ప్రధాని అయితేనే.. అరు గ్యారెంటీలు అమలు చేస్తారంట.. ఆయన ప్రధాని అయ్యేది లేదు.. ఇకడ ఆరు గ్యారెంటీలు అమలు చేసేది లేదని దుయ్యబట్టారు.