తెలంగాణలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణే తమ ధ్యేయమని రేవంత్‌రెడ్డి సర్కార్ చెప్తున్నది. హైడ్రా ఏర్పాటుకు దీన్ని ఒక కారణంగా కూడా చూపిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నందునే చెరువులు, మూసీ తీరంలో ఇండ్లను కూల్చివేస్తున్నట్టు అది సమర్థించుకుంటున్నది. అయితే ఒకవైపు ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తన లక్ష్యమని చెప్తూ పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడుతున్న ప్రభుత్వం మరోవైపు అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై పెద్దలు కన్నేస్తే మిన్నకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కొండొకచో హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బడావ్యాపారులకు, పాలకపార్టీ ముఖ్యులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలూ వినవస్తున్నాయి. దేశంలోనే పేరుమోసిన, రాహుల్‌గాంధీ నిత్యం విమర్శించే వ్యాపారవేత్త గౌతమ్ అదానీ బుధవారం హైదరాబాద్‌కు రావడం, రాష్ట్ర రెవెన్యూ మంత్రితో రహస్య సమావేశం జరపడం ఈ విమర్శలకు బలంచేకూరుస్తున్నది.
Musi Riverfront Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణలో భాగంగా దాదాపు లక్షన్నర ఇండ్లు నేలమట్టం కాబోతున్నాయా? మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) రూపొందించిన గూగుల్ మ్యాప్‌ను పరిశీలిస్తే ఈ సందేహమే కలుగుతున్నది. ఈ మ్యాప్ ప్రకారం.. ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రివర్లెవల్) గీతలోపు ఉన్న నిర్మాణాలే పుట్టగొడుగుల్లా కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అక్కడి నుంచి బఫర్‌జోన్‌ను లెక్కిస్తే, దాని పరిధిలోకి వచ్చే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో సుందరీకరణ ప్రాజెక్టు తమ పాలిట పిడుగుగా మారుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. రెవిన్యూ, నీటిపారుదల వంటి పలు శాఖలతో సమన్వయం చేసుకొంటూ ఎంఆర్డీసీఎల్ అధికారులు రూపొందించిన మ్యాప్ ప్రకారం.. హిమాయత్‌సాగర్ నుంచి వచ్చే అవుట్‌ఫ్లో, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) నుంచి వచ్చే అవుట్‌ఫ్లో వేర్వేరుగా ప్రవాహ మార్గాల్లో వచ్చి లంగర్‌హౌస్ సమీపంలో ఒకే మార్గంగా కలుస్తాయి. అక్కడినుంచి మూసీ నది నల్లగొండ జిల్లాలోనూ ప్రవహించి.. ఆపై కృష్ణా నదిలో కలుస్తుంది. ఉస్మాన్‌సాగర్ నుంచి లంగర్‌హౌస్ సమీపంలోని బాపూఘాట్ వరకు సుమారు 11.7 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈసా నది హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఆపై రెండూ కలిసే ప్రవహించే మార్గంలో సుమారు 45 కిలోమీటర్ల వరకు అంటే గౌరెల్లి వరకు ఎంఆర్డీసీఎల్ అధికారులు మ్యాప్‌ను రూపొందించారు.
ఎంఆర్డీసీఎల్ అధికారులు రూపొందించిన మ్యాప్‌లో రెండు నదుల ప్రవాహ మార్గం అవుటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 54 కిలోమీటర్ల మేర ఉన్నది. మూసీ రివర్ బెడ్‌ను అధికారులు రెడ్ మార్క్‌తో గుర్తించారు. అందుకే ఇటీవల కూల్చివేసిన ఇండ్లతోపాటు ఇప్పటికే వేలాది ఇండ్లపై రెడ్ మార్కుగా ఆర్బీ-ఎక్స్ (రివర్ బెడ్)ను ముద్రించారు. ఈ రెడ్ మార్కును పరిశీలిస్తే, రంగారెడ్డి-హైదరాబాద్-మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గరిష్ఠంగా ఐదు వేల నిర్మాణాల వరకు వస్తాయని ప్రాథమిక అంచనా. రివర్ బెడ్లో ఉన్న ఈ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మ్యాప్‌లో సూచించిన మరో బ్లూ మార్క్ ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రివర్ లెవల్) అంటే గరిష్ఠ నదీ ప్రవాహాన్ని సూచిస్తుంది. దీని పరిధిలోని నిర్మాణాలను చూస్తుంటే ‘అమ్మో… ఇన్ని నిర్మాణాలను తొలగించాలా?’ అనే భావన కలుగుతుంది. ఎఫ్ఆర్ఎల్ నుంచి నిబంధనల ప్రకారం బఫర్‌జోన్ 30 మీటర్ల మేర ఉంటుంది. ప్రస్తుతానికి అధికారులు మ్యాప్‌లో బఫర్‌జోన్‌ను గుర్తించలేదు. దీనిని కూడా గుర్తిస్తే ఎన్ని వేల నిర్మాణాలను తొలగించాల్సి వస్తుందో అంతుబట్టడం లేదు. సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నదీ మార్గం వెంట పెద్ద ఎత్తున రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో మార్గాలు, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఈ లెక్కన మున్ముందు బఫర్‌జోన్‌ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 54 కిలోమీటర్ల మేరలో లక్షన్నర వరకు నిర్మాణాలు ఉండొచ్చని మూసీపై అధ్యయనం చేస్తున్న నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అధికారులు మాత్రం ప్రస్తుతం రివర్బెడ్కు మాత్రమే పరిమితం అవుతున్నామని చెప్తున్నారు. మున్ముందు రేవంత్ సర్కారు అడుగులు ఎలా ఉంటాయనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇందుకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఎందుకంటే ఆయన గతంలో పలు మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ… తొలుత కేవలం ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని, ఆపై బఫర్‌జోన్‌కు వెళ్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో ఎఫ్‌టీఎల్‌తోపాటు బఫర్‌జోన్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బుల్డోజర్కు మార్గం సుగమం అయిందంటే రివర్బెడ్, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ అనే తేడా ఉండదనేది హైడ్రా కూల్చివేతలతోనే స్పష్టమైంది. అందుకే అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఎన్ని నిర్మాణాలను సేకరిస్తారు? ఎన్ని మీటర్ల మేర సుందరీకరణ చేపడతారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని మూసీపై అధ్యయనం చేస్తున్న నిపుణులు డిమాండు చేస్తున్నారు.
మూసీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అక్రమమంటూ ప్రభుత్వం వాటిని నేలమట్టం చేస్తున్నది. ఇప్పటివరకు కూల్చివేసిన 150 నిర్మాణాలకు పెద్దగా అనుమతులు లేవని తెలిసింది. దీంతో ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, వారిలో కొందరిని ఒప్పించి ఇండ్లను కూల్చివేసింది. కానీ, హైదర్షాకోట్, అత్తాపూర్, దిగువన ఉన్న నాగోల్ పరిసర ప్రాంతాల్లోని వేలాది నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి. దశాబ్దాలుగా వారంతా ఆస్తిపన్ను, నీటిబిల్లు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. అంతేకాదు, లంగర్‌హౌస్ పరిసర ప్రాంతంలో ఏకంగా హుడా లేఅవుట్లో దశాబ్దాల క్రితం చేపట్టిన నిర్మాణాలకు సైతం రెడ్‌మార్కు వేశారు. అంటే గతంలో అనుమతులు ఉన్నవే రివర్‌బెడ్‌లో ఉంటే, దాని అవతల ఉండే ఎఫ్ఆర్ఎల్, బఫర్‌జోన్ పరిస్థితి ఏమిటనేది అంతుబట్టడం లేదు.