జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 40 మంది దివ్యాంగులకు రిట్రో ఫిట్టేడ్ మూడు చక్రాల మోటర్ వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దివ్యాంగులకు సంవత్సరానికి రూ.5 కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో 10 రేట్లు పెంచి సంవత్సరానికి రూ. 60 కోట్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు నెలకు రూ. 3 వేలు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కేవలం రూ. 950 లు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 3 న జరిగే దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు.
దివ్యాంగులకు ఇచ్చే వాహనాల మరమ్మతులకు గాను ప్రతి జిల్లాకు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ రిపేరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు , జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత , మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి, కలెక్టర్ రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.