చివ్వెంల,(సూర్యాపేట)/తిప్పర్తి, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెండేండ్లు కావస్తున్నా హామీల అమలు ఊసెత్తడం లేదని విమర్శించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలో పార్టీ నాయకులు, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ‘కాంగ్రెస్ బాకీ’ కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని, గ్యారెంటీ కార్డులు దగ్గర పెట్టుకోవాలని, అమలుకాకపోతే తమను నిలదీయాలని రేవంత్‌రెడ్డి ఆ నాడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికీ ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా ‘కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు’ రూపంలో ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ హామీలన్నీ కూడా రేవంత్‌రెడ్డితోపాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గేలు కూడా ఇచ్చారని, వీరంతా బాధ్యులేనని స్పష్టంచేశారు. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో ‘చలో ఆల్మట్టి’
కర్ణాటక ప్రభుత్వం మరోమారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుందని దీనివల్ల దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, పాలమూరు ఉమ్మడి జిల్లాలకు మర ణ శాసనం అవుతుందని జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన తిప్పర్తిలో మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకునే సోయి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా బాధ్యతలేదని మండిపడ్డారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నీళ్ల గురించి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. రెండు, మూడు రోజుల్లోనే కేసీఆర్ నాయకత్వంలో చలో ఆల్మట్టి కార్యక్రమం చేపట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేందుకు ఓ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఇందులో నల్లగొండ జిల్లా రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరిస్తామని చెప్పారు. పైన ఉన్న కర్ణాటక, కింద ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న రేవంత్ సర్కార్‌ను ఎండగడతామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. చంద్రబాబుకు గురు దక్షిణగా తెలంగాణ నీటి హకులను కట్టబెడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.