(నెట్వర్క్, నమస్తే తెలంగాణ): కుల వృత్తులను ప్రోత్సహించాలనే, కులవృత్తిని నమ్ముకొని జీవించే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో లక్ష సాయం పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. బలహీనవర్గాలకు దేశంలో 100 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మీనా గార్డెన్లో శనివారం బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 155 మంది వివిధ కులవృత్తుల వారికి లక్ష సాయం చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో పలుచోట్ల కూడా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను 245 మంది లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మాకునూరి సంజయ్‌కుమార్‌తో కలిసి జిల్లా కేంద్రంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులకు లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో 300 మంది బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అందజేశారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి విడుతల వారీగా చెక్కులు అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వెల్లడించారు.