హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : మూసీ నది ప్రక్షాళన పేరిట జనాలను నిండా ముంచేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుపై గుడ్డిగా ముందుకు సాగుతూనే ఉన్నది. ఓ వైపు హద్దులు తేల్చకుండా, ఎన్ని ఆస్తులను కూల్చేస్తారో అధికారికంగా ప్రకటించకుండా దాగుడుమూతులు ఆడుతున్న ప్రభుత్వం.. స్పష్టత లేని ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి చక్కర్లు కొడుతున్నది. మంగళవారం ప్రతినిధుల బృందంతో కలిసి కిస్మత్‌పురా రెవెన్యూ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ బృందంలో మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేస్తున్న మెయిన్‌హార్ట్, ఆసియా డెవలప్మెంట్ ప్రతినిధులతో పాటు, పలు ఫైనాన్షియల్ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నట్టు తెలిసింది.
కొలిక్కి రాని రెవెన్యూ సర్వే
మాస్టర్‌ప్లాన్ లేకుండానే ప్రాజెక్టును పట్టాలెక్కించే క్రమంలో మూసీ వెంబడి వేలాది ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే మూసీ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని ఇప్పటికే నోటిఫై చేసిన భూ యజమానులు తేల్చి చెబుతున్నారు. పేదల బతుకులను రోడ్డున పడేస్తూ అంతర్జాతీయ ప్రతినిధుల బృందానికి ఈ భూములన్నీ ప్రాజెక్టు కోసమే సేకరిస్తున్నట్టు చెప్పుకొంటున్నది. ఇప్పటికే పలుమార్లు సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోగా తాజా పర్యటనలోనూ సర్వే కు వచ్చిన రెవెన్యూ యంత్రాంగాన్ని కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
ప్రాజెక్టు హద్దులపై స్పష్టత లేకుండానే సర్వే చేయడంపై అసహనంతో ఉన్న స్థానికులకు కనీసం స్పష్టతనివ్వలేకపోతున్నది. ఈ క్రమం లో బాపుఘాట్, కిస్మత్‌పురాలో రెవె న్యూ యంత్రాంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిపై అధికారులు, సర్కార్ పూటకో మాట చెబుతు న్న ప్రభుత్వం ఆయా సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, అంగీకరించిన విషయాలను బహిర్గతం చేయాలని డిమాం డ్ చేస్తున్నారు. ఒక్క ఇటుక కూల్చినా ప్రతిఘటన తప్పదని మూసీ పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు తేల్చిచెబుతున్నాయి.