హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పుష్ప-2 సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఎరచ్రందనం స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, దీని వల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంటూ పిటిషనర్ ఊహాజనిత అంశాల ఆధారంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేశారని జస్టిస్ మౌసమీ చటర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప-2 విడుదలకు 3 రోజుల ముందు హడావుడిగా ఈ పిటిషన్ దాఖలు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొంటూ.. పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. పుష్ప-2 బెనిఫిట్ షో, టికెట్ల ధరల పెంపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17కి కోర్టు వాయిదా వేసింది.