హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఉద్యమంతో సర్కార్‌లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, శక్తిశాఖ కార్యదర్శి హరిచందన, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం చర్చలు జరిపారు. కార్మిక ఉపాధి కల్పనశాఖ అధికారులు సైతం ఈ చర్చల్లో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో.. ఉద్యోగులను శక్తి శాఖలో విలీనం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని జేఏసీ నేతలు ప్రస్తావించారు. డిప్లొమా విద్య భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని.. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ స్వంతంత్రత కోల్పోయే ప్రమాదమున్నదని వాపోయారు. బోధన, బోధనేతర సిబ్బందికి సర్వీస్ భద్రత, పదోన్నతులు ప్రయోజనాల విషయంలో నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్ విద్యను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఉద్యోగులకు అన్ని రకాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేశారు. జేఏసీ చైర్మన్‌గా నాగరాజు, కన్వీనర్‌గా సురేశ్, సెక్రటరీ జనరల్‌గా శ్రావణ్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇదే విషయంపై గురువారం సైతం మళ్లీ చర్చలు జరుపుతామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.