ఆగ్రోస్‌లో ‘కమీషన్’ దందా జోరుగా నడుస్తున్నదా? బిల్లులు చెల్లించాలంటే.. 10% కమీషన్ ముట్టాల్సిందేనా? ప్రతి బిల్లులోనూ ‘నాకేంటి’ అనే లెక్కలేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆగ్రోస్తోపాటు వ్యవసాయ శాఖలోనూ దీనిపైనే జోరుగా చర్చ జరుగుతున్నది. ఆగ్రోస్ కేంద్రంగా వసూళ్ల పర్వానికి ఓ రాజకీయ నేత తెరతీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బిల్లులు క్లియర్ కావాలంటే 10% కమీషన్ ఇవ్వాల్సిందేనని సదరు నేత కాంట్రాక్టర్లను బహిరంగంగానే బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లుల కోసం వచ్చిన కాంట్రాక్టర్లను ‘నాకేంటి’ అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
AGROS | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల కోసం అవసరమైన పరికరాల సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆగ్రోస్ కార్పొరేషన్‌కు అప్పగించింది. కొన్నేండ్లుగా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, ఇతర పరికరాలను ఆగ్రోస్ సంస్థే టెండర్లు పిలిచి సేకరించి పౌరసరఫరాల సంస్థకు అందజేస్తున్నది. అయితే, ఆయా పరికరాల సరఫరాదారులకు రెండేండ్లుగా బిల్లులు సుమారు రూ.80 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల ఇందుకు సంబంధించి కొంత మొత్తం ప్రభుత్వం నుంచి విడుదలైనట్టు సమాచారం. ఆయా బిల్లులు చెల్లించేందుకు సదరు నేత కాంట్రాక్టర్లను 10% కమీషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతోపాటు తాజాగా యాసంగి కొనుగోళ్లకు అవసరమైన పరికరాల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో టెండర్ దక్కాలంటే ముందుగానే 10% కమీషన్‌కు ఒప్పందం చేసుకోవాలని, లేదంటే కాంట్రాక్టు దక్కకుండా చేస్తానని సదరు నేత హెచ్చరించినట్టు సమాచారం. ఈ విధంగా పాత బిల్లుల చెల్లింపులకు, కొత్త టెండర్లలో అవకాశం కల్పించేందుకు 10% కమీషన్‌ను లింకు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో పాత సరఫరాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకున్నా రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో రెండేండ్లుగా పరికరాలు సరఫరా చేస్తున్నామని, తీరా ఇప్పుడు బకాయిలు చెల్లించకుండా టెండర్లలో అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది.
నెల క్రితమే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా, ఇప్పటివరకు కొనుగోళ్ల కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్స్, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, ఇతర పరికరాలు చేరలేదు. టార్పాలిన్స్ లేకపోవడంతో అకాల వర్షాల కారణంగా రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట నీళ్లపాలవుతున్నది. ఈ పాపానికి ఆగ్రోస్ కారణమనే విమర్శలున్నాయి. పరికరాల సరఫరాకు సంబంధించి ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలకు పరికరాల సరఫరా నిలిచిపోయింది. కమీషన్లకు కక్కుర్తిపడిన అధికారులు, సదరు నేత కమీషన్ ఇచ్చిన వారికే టెండర్ దక్కేలా నానా తంటాలు పడుతున్నారని, ఇందులో భాగంగానే టెండర్లను మూడుసార్లు పొడగించారనే ఆరోపణలున్నాయి. రైతులు ఏమైనా ఫర్వాలేదు.. తమకు కావాల్సింది కమీషన్లు అన్నట్టుగా సదరు నేత వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆగ్రోస్‌లో కమీషన్ల దందా సాగిస్తున్న సదరు రాజకీయ నేత.. తాజాగా మొత్తం పరికరాల సరఫరానే తన గుప్పిట్లో పెట్టుకునే ఎత్తుగడకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల పలు రాష్ర్టాల్లో పర్యటించిన సదరు నేత అక్కడి కంపెనీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. సదరు కంపెనీల పరికరాలను ఇక్కడ తమ పేరిట సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన కంపెనీకే టెండర్ వచ్చేలా రంగంసిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతరులెవ్వరినీ టెండర్ దాఖలు చేయకుండా కట్టడి చేస్తున్నట్టు తెలిసింది.