హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల విషయమై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి శనివారం బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశా రు. రాష్ట్రంలో 2019-24లో సర్పంచులుగా కొనసాగి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని తెలిపారు. పాలకమండలి గడువు ముగిసి ఐదునెలలు కావొస్తున్నా ఇప్పటికీ పెండింగ్ బిల్లులు అందక 12,769 గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
సర్పంచుల పెండింగ్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఉపాధ్యక్షులు సుర్వీ యాదయ్యగౌడ్, నత్తి మల్లేశ్ ముదిరాజ్, మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీరామ్‌రెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.