Electricity Discoms | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థలు (డిస్కంలు) చేస్తున్న పొరపాటు రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు గ్రహపాటుగా మారుతున్నాయి. డిస్కంల తప్పిదంతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతున్నది. సకాలంలో అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్) ప్రతిపాదనలను సమర్పించడంలో విఫలమవుతుండటంతో ఈఆర్సీ జరిమానాలు విధిస్తున్నది. రాబడికి కోతపెడుతున్నది. ఈ భారం మళ్లీ వినియోగదారులపైనే మోపాల్సి వస్తున్నది. అయితే ఈసారి రాబడికి కోత విషయంలో ఈఆర్సీ కాస్త పెద్దమనసు చేసుకుంది. ఐదేండ్ల రాబడికి కోత విధించాల్సి ఉండగా, కేవలం ఒక్క ఏడాది రాబడి కోతకు పరిమితం చేసింది.
నిబంధనలు పాటించకుండా డిస్కంలు జనవరిలో కాకుండా 8 నెలలు ఆలస్యంగా ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లో ఈఆర్సీకి పిటిషన్లను సమర్పించాయి. రాబోయే ఐదేండ్ల కాలానికి ఏడాదికి రూ. 582 కోట్ల చొప్పున ఐదేండ్లకు రూ.2,500 కోట్ల రాబడిని కోల్పోయే అవకాశం ఉంది. జెన్కో రూ.396 కోట్లు, ట్రాన్స్కో అండ్ స్టేట్ లోడ్ డిస్పాస్ సెంటర్కు రూ. 119 కోట్లు, డిస్కంలకు రూ. 62 కోట్లు, డిస్కంల రిటైల్ వ్యాపారంలో రూ. 7 కోట్ల చొప్పున ఈఆర్సీ కోతపెట్టింది. ఏఆర్ఆర్ సమర్పణలో ఆలస్యమైనందున డిస్కంలకు నెలపాటు రోజుకు రూ. 5 వేలు, ఆ తర్వాత రోజుకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తున్నది. దీంతో ఈఆర్సీ కోటిన్నర జరిమానా విధించింది.