హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘తొలుచు వాన్డ్రు’, ‘తెలంగాణ చరిత్ర తొవ్వలో’ అనే రెండు పుస్తకాలను రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన చరిత్ర ఎంతో ఉందని, చరిత్ర పరిశోధకుల బృందం ఈ ప్రాంతంలోని చరిత్రపై లోతైన అధ్యాయనం చేయాలని మంత్రి కోరారు.
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకుల బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్టలో జరిపిన పరిశోధనలో వెలుగు చూసిన తొలుచు వాన్డ్రు శాసనమే తొలి తెలుగు రాతి రాత శాసనంగా గుర్తించడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణలోని చరిత్రను భవిష్యత్ తరాలకు పుస్తకాల రూపంలో అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రాంతంలో చరిత్రాత్మక సంపద ఎంతో ఉందని, చరిత్ర పరిశోధకులు ఈ ప్రాంతంలోని సమగ్ర చరిత్రను వెలికితీసేందుకు కృషి చేయాలని, దీనికి తాము పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రామోజు హర గోపాల్‌తోపాటు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని మంత్రి సన్మానించారు.