Indiramma Indlu | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లు వాటి లబ్ధిదారులకు భారంగా మారాయి. రాయితీ ధరలకు స్టీల్, సిమెంట్ ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకటనకే పరిమితమైంది. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. మంజూరు పత్రాలు వచ్చాక లబ్ధిదారులు సొంతగా రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తేగాని మొదటి బిల్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పట్ల విముఖత చూపుతున్నారు. ఇసుక, ఇటుక, సిమెంటు, స్టీల్ తదితర నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ఎంత తక్కువ వ్యయంతో ఇల్లు నిర్మించాలన్నా ప్రతి చదరపు అడుగుకు కనీసం రూ.1,200 నుంచి రూ.1,400 వరకు ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన 600 చదరపు అడుగుల ఇంటికి దాదాపు రూ.7-8 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తున్నది. ప్రభుత్వం మాత్రం ఒక్కో ఇంటికి నాలుగు విడతల్లో మొత్తం రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు తొలుత తమ సొంత సొమ్ము ఖర్చు చేస్తేగానీ బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదు. రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చుచేసి, పునాది వరకు నిర్మించుకుంటే ఆ తర్వాత మొదటి బిల్లు మంజూరవుతుంది. కానీ, లబ్ధిదారులంతా నిరుపేదలు కావడంతో ఒకేసారి ఆ మొత్తాన్ని భరించే పరిస్థితి లేదు. ఐకేపీ కింద రూ.లక్ష వరకు అప్పు ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ రుణాలు చాలామందికి మంజూరు కావడంలేదు. స్టీలు, సిమెంటు రాయితీపై ఇప్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇసుకను ఉచితంగానే ఇస్తున్నప్పటికీ రవాణా కోసం లబ్ధిదారులు ప్రతి టన్నుకు రూ.800 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి వస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ప్రభుత్వం 583 గ్రామాల్లో 70,322 ఇండ్లను మంజూరు చేసింది. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణ సామాగ్రి సమకూర్చుకోవాలని, 90 రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని షరతులు విధించింది. రెక్కల కష్టంపై జీవించే నిరుపేద లబ్ధిదారులు ఒకేసారి రూ.2 లక్షలు సమకూర్చుకోలేక సతమతమవుతున్నారు. చేతిలో సరిపడా డబ్బులేక, అప్పు ఇచ్చే నాథుడు లేక, ఎలా ముందుకుసాగాలో అర్థంగాక చాలామంది లబ్ధిదారులు ఇండ్ల మంజూరు పత్రాలను పక్కన పడేశారు. ఇప్పటివరకు దాదాపు 18 వేల మంది లబ్ధిదారులు మాత్రమే ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం, వారిలో కేవలం 6 వేల మందే పునాదుల వరకు నిర్మాణాలను పూర్తి చేయడం ఇందుకు నిదర్శనం. దీన్నిబట్టే ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరు ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇందిరమ్మ ఇంటి వైశాల్యం 600 చదరపు అడుగులకు మించరాదని, లేకుంటే ఇల్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన కూడా చాలామంది లబ్ధిదారులకు ప్రతిబంధకంగా మారింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం 70 గజాల్లోపు స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ, చాలా మందికి అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు ఉన్నాయి. కుటుంబసభ్యుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో 600 చదరపు అడుగుల ఇల్లు తమకు సరిపోదని, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించాలని వారు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎంఏవైతో అనుసంధానం చేయడం, గరిష్ఠంగా 600 చదరపు అడుగుల్లోనే ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది.