బడంగ్‌పేట/తెలకపల్లి, జనవరి 7: పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి. భూవివాదంలో తలదూర్చినందుకు ఇన్స్పెక్టర్, లంచం డిమాండ్ చేసినందుకు ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. వివరాలు ఇలా.. భూవివాదంలో తలదూర్చినట్టు పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ కే సతీశ్‌పై ఫిర్యాదులు వచ్చాయి. విచారణ జరిపిన రాచకొండ సీపీ సుధీర్ బాబు.. ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు. పోలీసులు భూ వివాదాల్లో తలదూర్చితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా గత నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామ సమీపంలో కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు ఆరుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు కాకుండా ఉండటానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయమై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎస్పీ వైభవ్‌గైక్వాడ్.. బాధ్యులైన ఎస్సై వస్ర్తాంనాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులును ఆదివారం సస్పెండ్ చేశారు.