హైదరాబాద్, జనవరి3 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పనులు పూర్తికాకముందే, పూర్తయినట్టు నిర్మాణ ఏజెన్సీకి ధ్రువపత్రాలను జారీచేసిన ఎస్ఈ, ఈఈపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. మేడిగడ్డ బరాజ్‌ను ఎల్అండ్టీ ఏజెన్సీ నిర్మించిన విషయం తెలిసిందే. బరాజ్ కుంగుబాటు తర్వాత దాని పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ ఏజెన్సీదేనని తెలుపగా, తమకేమీ సంబంధం లేదని సదరు ఏజెన్సీ వెల్లడించింది. అప్పటి ఎస్ఈ రమణారెడ్డి, ఈఈ తిరుపతిరావు ప్రాజెక్టు కంప్లీషన్ సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చారని ఏజెన్సీ తెలిపింది. నిబంధనలకు లోబడే ఆ సర్టిఫికెట్ ఇచ్చామని సదరు ఎస్ఈ, ఈఈలు వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై విచారించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ తన నివేదికను ఇప్పటికే సమర్పించింది. మరోవైపు 3 బరాజ్‌లపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నది. కంప్లీషన్ సర్టిఫికెట్ జారీపై 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేదంటే సదరు ఎస్ఈ, ఈఈపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.
ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్ల ఆమోదం
హైదరాబాద్ జలసౌధలో శుక్రవారం నిర్వహించిన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) సమావేశంలో వివిధ ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్లను ఆమెదించారు. టెండర్లను పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఏమ్మార్పీ, దేవాదుల ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్లపైనా చర్చించారు. వివిధ ప్రాజెక్టుల టెండర్లను పొడిగింపుపై కూడా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాలను ప్రభుత్వానికి నివేదించి, అనుమతులు పొందాలని తుదకు నిర్ణయించారు.