చండూరు, మార్చి 4 : రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ జిల్లా చండూరులో దివ్యాంగులు మెడలో చెప్పులదండ వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది దివ్యాంగులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ రూ.6వేలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చి తప్పినందుకు మెడలో చెప్పుల దండలు వేసుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.