Pension | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం సత్వరమే దివ్యాంగుల పింఛన్ల మొత్తాన్ని రూ.4016 నుంచి రూ.6016కు పెంచేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ఇంటి వద్ద ఓ దివ్యాంగుడు ప్లకార్డును ప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచి పంపిణీ చేశారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా పింఛన్లు పెంచలేదని, సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలని దివ్యాంగుడు ధీరావత్ మహేశ్‌నాయక్ ప్లకార్డును ప్రదర్శించారు.
దివ్యాంగులందరికీ స్వయం ఉపాధి రుణాలు, ఆర్టీసీలో ఉచిత రవాణా, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టేలా తెలంగాణ సీఎంతో చర్చించి, తమ సమస్యల పరిషరానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్లకార్డును ప్రదర్శించడం విశేషం. కాగా పోలీసులు వచ్చి మహేశ్‌ను అక్కడి నుంచి పంపించి వేశారు.